రాజకీయం

ఐదు దశాబ్దాల కాంగ్రెస్ ‘రామ్’బాణం.. విలువల పునాదిపై మొదలు కానున్న‘సర్వోత్తమ్’ ప్రస్థానం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాంరెడ్డి సోదరుల అరుదైన ప్రజా ప్రస్థానం ఉమ్మడి ఖమ్మం, నల్లగొండల సరిహద్దులు దాటిన కీర్తి.. నేడు విద్యావంతుడి నాయకత్వంలో 'రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి' By Lakavath Sudhir  అక్ట…

By · · Updated

Share this article
ఐదు దశాబ్దాల కాంగ్రెస్ ‘రామ్’బాణం.. విలువల పునాదిపై మొదలు కానున్న‘సర్వోత్తమ్’ ప్రస్థానం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాంరెడ్డి సోదరుల అరుదైన ప్రజా ప్రస్థానం

ఉమ్మడి ఖమ్మం, నల్లగొండల సరిహద్దులు దాటిన కీర్తి.. నేడు విద్యావంతుడి నాయకత్వంలో 'రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి'

By Lakavath Sudhir 

అక్టోబర్ 30 తెలంగాణ గళం:

రాజకీయాలు కొందరికి అధికార సోపానాలు కావచ్చు.. మరికొందరికి పదవుల వేదికలు కావచ్చు. కానీ అరుదైన కొందరి ప్రస్థానంలో మాత్రం అవి ప్రజాసేవకు సార్థక సాధనాలుగా నిలుస్తాయి. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాంగ్రెస్‌ అనుబంధం, తరతరాల రాజకీయ అనుభవం, ప్రజలతో మమేకమైన జీవనశైలి.. రాంరెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్న అంశాలు. ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు సమకాలీన రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో సంచలనాలు సృష్టించడం, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల రాజకీయాల్లో ఏకకాలంలో చక్రం తిప్పడం తెలుగు నాట ఒక అరుదైన రికార్డు. ఉన్నత విద్యతో పాటు ఉన్నత విలువలను నమ్ముకుని, త్యాగాల పునాదులపై సాగిన ఆ మహోన్నత ప్రస్థానం.. నేడు వారి వారసుడైన, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి రూపంలో సరికొత్త విద్యా అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. 

ఉమ్మడి ఖమ్మం విలువల సంతకం.. పెద్దనాన్న ‘వెంకటరెడ్డి’!

రాంరెడ్డి కుటుంబ పెద్ద, మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి వెంకట రెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వివాదరహితుడిగా, మృదుస్వభావిగా చెరిగిపోని ముద్ర వేశారు. 1967లో పాతలింగాల గ్రామ సర్పంచ్‌గా క్షేత్రస్థాయి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదుగుతూ ఐదు పర్యాయాలు శాసనసభకు ఎన్నికయ్యారు. సుజాతానగర్, పాలేరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తోటబడి (హార్టికల్చర్), పట్టుపరిశ్రమ (సెరికల్చర్) శాఖల మంత్రిగా రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేశారు. నాటి అసెంబ్లీలో అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ బాధ్యతలను సైతం అత్యంత పారదర్శకంగా నిర్వహించి, తుదిశ్వాస వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల సేవలోనే గడిపిన మహోన్నత వ్యక్తి ఆయన.

ఉమ్మడి నల్లగొండ సింహగర్జన.. నాన్న ‘దామన్న’!

మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా (ప్రస్తుత సూర్యాపేటతో కలిపి) రాజకీయాల్లో నిలువెత్తు ధైర్యానికి నిదర్శనంగా నిలిచారు మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి (దామన్న). 1985 ఎన్నికల్లో కమ్యూనిస్టుల కంచుకోట అయిన తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సంచలన విజయం సాధించారు. పార్టీ టికెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించిన ఘనత, జనబలమే తన బలమని నిరూపించిన ధీరుడు ఆయన. సూర్యాపేట నియోజకవర్గం నుంచి కూడా భారీ విజయాలు నమోదు చేసిన దామన్న.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సమాచార సాంకేతిక  మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నాటి ఐటీ రంగ విస్తరణలో, ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సాధనలో ఆయనను ప్రజలు ప్రేమగా "టైగర్ రామ్" అని పిలుచుకున్నారు.

త్యాగాల పునాదులపై.. సరిహద్దులు లేని ప్రజానుబంధం!

రాంరెడ్డి సోదరుల రాజకీయ జీవితం నిరంతరం కార్యకర్తలతో, సామాన్య ప్రజలతో ముడిపడిన ఉజ్వల ప్రస్థానం. భౌగోళికంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల సరిహద్దులు వేరైనా.. ప్రజల పట్ల వారికున్న సేవా దృక్పథం ఒక్కటే కావడం విశేషం. వ్యక్తిగత ఆస్తులు, సొంత ప్రయోజనాల కంటే రాజకీయ సహచరుల సంక్షేమానికి, ప్రజా హితానికే వారు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఖమ్మం జిల్లా పాతలింగాల ప్రాంతంతో ఉన్న విడదీయరాని అనుబంధం నుంచి నేటి ఇల్లందు నియోజకవర్గ రాజకీయాల వరకు ప్రజలతో ముడిపడిన అనేక సేవలు, జ్ఞాపకాలు ఈ కుటుంబ చరిత్రలో ఉన్నాయి. ఈ కుటుంబానికి వారసత్వం అంటే కేవలం పేరు, పదవి కాదు.. ప్రజా సేవ అనే అపారమైన బాధ్యతను భుజాన వేసుకోవడం.

ఉన్నత విద్య.. అంతర్జాతీయ అవగాహన.. సరికొత్త ఆలోచనా దృక్పథం!

ఆ మహోన్నత తరం నిర్మించిన రాజకీయ విలువలను పుణికిపుచ్చుకుని, నేటి తరం ప్రతినిధిగా, విద్యావంతుడైన నాయకుడిగా రంగంలోకి దిగుతున్నారు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి. విద్యావంతుడైన నాయకుడు సమాజానికి సరైన దిశానిర్దేశం చేయగలడనే నమ్మకానికి ఆయన నిలువెత్తు రూపం.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ (B.E.) పట్టా పొందిన ఆయన, ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా (USA) లో మాస్టర్స్ (MBA) పూర్తి చేశారు. అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాల్లో రాణించిన అపార అనుభవంతో పాటు, సొంత మట్టితో ఉన్న అనుబంధం వీడలేదు.

విద్య మనిషికి విజ్ఞానాన్ని అందిస్తే.. విలువలు సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తాయి. సర్వోత్తమ్ రెడ్డి గారికున్న ఈ ఉన్నత విద్యాభ్యాసం, అంతర్జాతీయ అవగాహన.. నేటి సమాజంలోని పట్టభద్రులు, విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా, సాంకేతికంగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి రాజకీయ ఉద్దండుల ఇంట్లో పెరిగిన సంస్కారం, నేటి సాంకేతిక పరిజ్ఞానం కలగలిసి చట్టసభల్లో ప్రజా సమస్యలపై మేధోపరమైన చర్చలు జరపడానికి, అభివృద్ధి ప్రణాళికలు రచించడానికి ఈ విద్యా సంస్కారమే మూలస్తంభం.

రాజకీయాల్లో తరాలు మారవచ్చు.. పదవులు చేతులు మారవచ్చు.. అధికార సమీకరణాలు తలకిందులు కావచ్చు. కానీ ప్రజల కోసం చేసిన త్యాగం, నిలబెట్టుకున్న విలువలు, సంపాదించుకున్న విశ్వాసం మాత్రమే కాలపరీక్షకు నిలిచి గెలుస్తాయి. పదవులతో కేవలం తాత్కాలిక గుర్తింపు రావచ్చు.. కానీ నిరంతర ప్రజాసేవతోనే చరిత్రలో శాశ్వత స్థానం లభిస్తుంది. నాన్న దామన్న, పెద్దనాన్న వెంకటరెడ్డి గారి ఆశయాల అడుగుజాడల్లో, ఉన్నత విద్యార్హతలు, అంతర్జాతీయ దార్శనికతతో ప్రజా క్షేత్రంలోలోకి అడుగుపెడుతున్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి ప్రస్థానం రాబోయే రోజుల్లో సరికొత్త ప్రజా వికాసానికి, సమగ్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేయనుంది.

Tags: