గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజల్ని టెన్షన్ పెడుతున్న అతిపెద్ద సమస్య ఎల్ నినో కరువు. వర్షాభావం కారణంగా రానున్న రోజుల్లో తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జులై వరకు ఎండల తీవ్రతతో పాటు నీటి ఎద్దడి పెరిగే ప్రమాదముందని, అందువల్ల ప్రజలు ప్రతి బొట్టు నీటిని, విద్యుత్‌ను ఎంతో పొదుపుగా వాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవటం, భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల తాగునీటి సమస్య తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఈ నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని.. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును ఈ సీజన్లో చేపట్టవద్దని దానికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను వేసుకోవాలని మంత్రులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంటుంది. ముందస్తు ప్రణాళికతో నీటిని, విద్యుత్‌ను నిర్వహించుకోవడంతో పాటు ప్రభుత్వ సూచనలను పాటిస్తేనే ఈ వేసవి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పుడు ఈ ఎల్ నినో ఎఫెక్ట్ విద్యార్థులపైనా పడుతోంది. ఎల్ నినో కారణంగా మండే ఎండలు, తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ముందుగానే వేసవి సెలవులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని 'స్లేట్ – ద స్కూల్' వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు. బెంగళూరులో మాదిరిగా.. హైదరాబాద్ నగరంలోనూ భూగర్భ జలాలు అడుగంటి పోయాయని చెప్పారు. అర్నబ్ తుపాన్ కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తున్నా.. దాని ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని అన్నారు. డిసెంబర్ 14 తరువాత హైదరాబాద్ వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించారు.
'నీటి ఎద్దడి కారణంగా హైదరాబాద్ నగరంలో బడులు, విద్యా సంస్థలు మార్చి తరువాత నడపడం కష్టమై పోతుందా ? ప్రభుత్వం వేసవి సెలవుల్ని ముందస్తుగానే ప్రకటిస్తుందా ? తెలియదు.. ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏదీ ప్రస్తుతానికి రాలేదు. కానీ అవకాశం ఉంది. మరి సిలబస్ పూర్తి చెయ్యడం ఎలా అనే అనుమానం రావచ్చు. నీరు, విద్యుత్ కొరత కారణంగా బహుశా మార్చి మొదటి వారానికి ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులు పెట్టుకోండి అని చెప్పొచ్చు. ఆన్లైన్ క్లాసులంటే తిరిగి పిల్లల చేతికి మొబైల్.. వారు పాఠాలు వినేది ఏమీ ఉండదు.. మొబైల్‌కు అడిక్ట్ అయిపోతారని చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు. ఆ విషయంలోనూ సర్దుబాటు అయ్యేలా మా స్కూల్ నుంచి చర్యలు తీసుకుంటున్నాం' అని వాసిరెడ్డి అమర్నాథ్ వెల్లడించారు. ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించడానికి బదులు.. ఇప్పటి నుంచే రోజు అదనపు సమయం తరగతులు నిర్వహించి.. సిలబస్‌ను ముందే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.
సర్కారు బడులపై మొదలైన ఎల్‌నినో ఎఫెక్ట్..
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో జలమండలి నీటి సరఫరాను తగ్గించడంతో.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2531 పాఠశాలల్లో తాగునీరు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ఖైరతాబాద్, అబిడ్స్, బషీర్‌బాగ్ లాంటి ప్రాంతాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగు నీరు సరిపడా రావడం లేదు. ప్రయివేట్ స్కూళ్లు ఇప్పటికే ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నాయి. మార్చి నాటికి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి ఎద్దడి.. ఆన్లైన్ క్లాసులు
కాగా, ఇప్పటికే బాసర రాజీవ్ గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. గోదావరి నది నుంచి నీటిని తోడే ప్రధాన పంపింగ్ మోటార్లు సడన్‌గా మొరాయించడంతో పాటు ఎల్ నినో ప్రభావంతో నీటి మట్టాలు తగ్గిపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులకు నిత్యం నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు యాజమాన్యం ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులను ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండాలని అధికారులు ఆదేశించారు. నవంబర్ 17 నాటికి ఆన్లైన్ సిలబస్‌ను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులందరికీ నవంబర్ 19 నుంచి 21 వరకు మిడ్-టర్మ్ పరీక్షలను క్యాంపస్‌లోనే నేరుగా నిర్వహిస్తామని యాజమాన్యం వెల్లడించింది. ఈలోగా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. పంపింగ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.






