రాజకీయం

ఏళ్ల నిరీక్షణకు తెర.. సింగరేణి ఇళ్ల స్థలాలకు హక్కు

మూల దరఖాస్తుల పరిశీలనకు 45 రోజుల గడువు.. జిల్లాల వారీగా త్రిసభ్య కమిటీలు  సెప్టెంబర్‌ 19 (తెలంగాణ గళం): సింగరేణి బొగ్గు బెల్ట్‌ పరిధిలో ఇళ్ల స్థలాల హక్కుల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కర…

By · · Updated

Share this article
ఏళ్ల నిరీక్షణకు తెర.. సింగరేణి ఇళ్ల స్థలాలకు హక్కు

మూల దరఖాస్తుల పరిశీలనకు 45 రోజుల గడువు.. జిల్లాల వారీగా త్రిసభ్య కమిటీలు

 సెప్టెంబర్‌ 19 (తెలంగాణ గళం): సింగరేణి బొగ్గు బెల్ట్‌ పరిధిలో ఇళ్ల స్థలాల హక్కుల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి పెండింగ్‌ దరఖాస్తులను 45 రోజుల్లో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యపై శనివారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన జీఓ నెం.76ను కూడా పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.

భూముల స్వభావం, ప్రభుత్వ లేదా సింగరేణి హక్కులు, ప్రస్తుత నివాస పరిస్థితులు, సంబంధిత చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం అర్హతను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు సంబంధించిన అంశాలు లేదా ఇతర వ్యత్యాసాలు గుర్తించిన సందర్భంలో అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

జిల్లాల వారీగా కమిటీలు

పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీల్లో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రతినిధి, జిల్లా రిజిస్ట్రార్‌ సభ్యులుగా ఉంటారు. ఆయా జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న మూల దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న దరఖాస్తుదారుల విషయంలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు సంబంధించి ఇళ్ల స్థలాల హక్కుల అంశాన్ని చట్టపరమైన విధానంలో పరిష్కరించే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Tags: