అడ్డుకుంటే చంపేస్తానని బెదిరింపులు
మహిళను శారీరకంగా కలవాలంటూ వేధింపులకు పాల్పడినట్లు సర్పంచ్‌పై ఆరోపణలు.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దామెర పోలీసులు
పరకాల తెలంగాణ గళం నవంబర్ 28:
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ల్యాదల్ల గ్రామ సర్పంచ్ బొంకూరి రవి యాదవ్‌పై అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు రావడంతో దామెర పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళను గత ఐదు నెలలుగా ఫోన్ చేస్తూ శారీరకంగా కలవాలని సర్పంచ్ రవి యాదవ్ వేధిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలో పని నిమిత్తం గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మహిళను చూసి సర్పంచ్ అసభ్యకరమైన సైగలు చేస్తూ కార్యాలయంలోకి రావాలని సూచించాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయాన్ని భయంతో బాధితురాలు తన భర్తకు తెలియజేయగా, ఆయన గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్ రవి యాదవ్‌ను పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే గ్రామ పెద్దల సమక్షంలోనూ సర్పంచ్ తమను బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు దామెర పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్పంచ్ బొంకూరి రవి యాదవ్‌పై దామెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



