పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 12:
పరకాల మండలం వెల్లంపల్లి గ్రామం నుంచి గట్లకనిపర్తి గ్రామం వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుపై దుమ్ము సమస్య వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కంకర పోయడంతో వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో భారీగా దుమ్ము లేస్తోంది. దుమ్ము కారణంగా రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము పెద్ద ఎత్తున వ్యాపిస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుమ్ము వల్ల కళ్లలోకి దుమ్ము వెళ్లి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయించాలని, దుమ్ము నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.






