
ఎల్నినో పేరుతో రైతులపై కొత్త నిబంధనలా?
గతంలో ఎన్నడూ లేని విధానంపై రైతుల్లో అనుమానాలు.. ఆందోళనలు!
వరి సాగు చేయాలా వద్దా అన్నది రైతు నిర్ణయించుకోలేడా?
పంట నష్టమైతే బాధ్యత రైతుదేనా?
ఈ విధానం వెనుక ప్రభుత్వ ఆదేశాలున్నాయా.. డీలర్ల స్వీయ నిర్ణయమా?
తెలంగాణ గళం,ప్రత్యేక కథనం, మెట్పల్లి రిపోర్టర్:
ఎల్నినో ప్రభావం కారణంగా వరి సాగుకు దూరంగా ఉండాలని సూచిస్తున్న నేపథ్యంలో, వరి విత్తనాల కొనుగోలుకు రైతులతో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు రాయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ వినని, చూడని ఈ విధానం ఇప్పుడు ఎందుకు అమల్లోకి వచ్చింది? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
రైతుతో రాతపూర్వక హామీ ఎందుకు?
వరి విత్తనాలు కొనుగోలు చేయాలనుకునే రైతులు తమ సొంత నిర్ణయంతోనే వరి సాగు చేస్తున్నామని, కరెంటు సరఫరా లేకపోయినా, సాగునీరు అందకపోయినా, ఇతర కారణాలతో పంట నష్టం జరిగినా డీలర్లకు గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం ఉండదని అంగీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమకు వరి పంట మాత్రమే సాగు చేయడం సాధ్యమవుతోందని, అందుకే విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న రైతులు.. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఇలాంటి పత్రాలు ఎందుకు రాయించుకోవాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు.
గతంలో లేని విధానం ఇప్పుడెందుకు?
గతంలో వరి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఇలాంటి డిక్లరేషన్ విధానం తమకు తెలియదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ విధానాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక కారణాలేమిటో అధికారులు స్పష్టం చేయాలని కోరుతున్నారు.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని భావిస్తే, రైతులకు ముందుగానే వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించడం, ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు ఇవ్వడం, సాగునీటి లభ్యతపై స్పష్టత కల్పించడం అధికారుల బాధ్యత కాదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పంట నష్టానికి రైతే బాధ్యుడా?
వ్యవసాయం అనేది వాతావరణం, సాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైతు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ప్రకృతి వైపరీత్యాలు, నీటి కొరత వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. అలాంటప్పుడు ముందుగానే రైతుతో బాధ్యత అంతా తనదేనని రాయించుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఈ డిక్లరేషన్ కారణంగా ప్రభుత్వానికి లేదా డీలర్లకు ఉన్న చట్టపరమైన బాధ్యతలు పూర్తిగా తొలగిపోతాయా? లేక ఇది కేవలం రైతు స్వచ్ఛంద నిర్ణయాన్ని నమోదు చేసే పత్రమా? అన్నది సంబంధిత అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
ప్రభుత్వ ఆదేశాలున్నాయా?
ఈ సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ఆదేశించిందా? వ్యవసాయ శాఖ నుంచి ఏవైనా మార్గదర్శకాలు జారీ అయ్యాయా? లేక విత్తన డీలర్లు తమ స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత అవసరం.
ఒకవేళ ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న విధానమైతే, దానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రజలకు వెల్లడించాలి. డీలర్లు తమంతట తామే ఈ విధానాన్ని అనుసరిస్తుంటే, దానిపై వ్యవసాయ శాఖ స్పందించి స్పష్టత ఇవ్వాలి.
రైతులకు భరోసా కల్పించాల్సిన సమయంలో..
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అనవసరమైన అనుమానాలు, ఆందోళనలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. వరి సాగుపై సూచనలు చేయడం ఒక అంశమైతే, విత్తనాల కొనుగోలుకు రైతులతో బాధ్యతా పత్రాలు రాయించుకోవడం మరో అంశం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని అధికారులు వివరించాల్సిన అవసరం ఉంది.
వరి సాగు చేయవద్దని సూచించడమే ప్రభుత్వ ఉద్దేశమా? లేక పంట నష్టానికి సంబంధించిన బాధ్యతల నుంచి ముందుగానే తప్పించుకోవడానికే ఈ డిక్లరేషన్ విధానమా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన నియంత్రణ అధికారులు స్పందించాలి. రైతుల ఆందోళనలను నివృత్తి చేసి, ఈ విధానం వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడించాలి. అప్పుడే రైతుల్లో నెలకొన్న అనుమానాలకు తెరపడుతుంది.




