అర్హుల ఓటు హక్కుకు భరోసా కల్పించాలి
ఓటరు జాబితాలో తప్పులకు తావివ్వొద్దు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి: దేవసేన
By Lakavath Sudhir
ఇల్లందు, అక్టోబర్ 28 (తెలంగాణ గళం): అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కేలా, ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. దేవసేన అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదు, చేర్పులు, తొలగింపులు, వివరాల సవరణల్లో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
బుధవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఆమె ఈఆర్‌ఓలతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ఫారం 6, 6ఏ, 7, 8 దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించి, ఓటర్ల వివరాల్లో మార్పులు ఉంటే సరిచేయాలని ఆదేశించారు.
ద్వంద్వ నమోదులపై ప్రత్యేక దృష్టి
ఓటర్ల చేర్పులు, తొలగింపులు అత్యధికంగా నమోదైన పోలింగ్ కేంద్రాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని దేవసేన సూచించారు. ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, విచారణ నిర్వహించే సమయంలో తగిన సమయం ఇవ్వాలని, ప్రతి దరఖాస్తుకు సంబంధించిన రికార్డులను భద్రపరచాలని తెలిపారు. సరిహద్దు జిల్లాల్లో ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువ ఓటర్ల నమోదు, ఎపిక్ కార్డుల పంపిణీ, ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
జిల్లాలో 40,986 దరఖాస్తులు పెండింగ్
జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో 30 మంది ఏఈఆర్‌ఓలు, 28 మంది అదనపు ఏఈఆర్‌ఓలు, 123 మంది సూపర్‌వైజర్లు, 1,127 మంది బీఎల్‌ఓలు విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలో ఎపిక్ కార్డుల కవరేజీ 99.99 శాతం పూర్తయిందన్నారు. 18–19 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు 5,608 మంది, 85 ఏళ్లు పైబడిన వృద్ధ ఓటర్లు 13,130 మంది, ఎన్నారై ఓటర్లు 28 మంది ఉన్నట్లు వివరించారు.
జిల్లాలో ఫారం 6కు సంబంధించి 13,119, ఫారం 6ఏకు 34, ఫారం 7కు 800, ఫారం 8కు 27,033 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మొత్తం 40,986 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.





