జాతీయం

తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే రెడీ.. రూ.1641 కోట్లతో, సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం

  వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసే ఎన్‌హెచ్-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారిపై ప్రస్తుతం…

By · · Updated

Share this article
తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే రెడీ.. రూ.1641 కోట్లతో, సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం

 

వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసే ఎన్‌హెచ్-563 నాలుగు వరుసల విస్తరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారిపై ప్రస్తుతం వాహనాల ట్రయల్‌రన్‌ కొనసాగుతోంది. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే గతంలో గంటన్నర వరకు పట్టిన వరంగల్‌-కరీంనగర్‌ ప్రయాణం సుమారు 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. అక్టోబర్‌ మొదటి వారంలో లేదా దసరాలోపు రహదారిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరో కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని కీలక నగరాలైన వరంగల్‌-కరీంనగర్‌లను అనుసంధానించే జాతీయ రహదారి-563 (ఎన్‌హెచ్-563) 4 వరుసల విస్తరణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన రహదారిపై వాహనాల ట్రయల్‌రన్‌ కొనసాగుతోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అధికారులు రహదారిపై ఏవైనా లోపాలు, సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ఈ జాతీయ రహదారి విస్తరణను చేపట్టారు.
సుమారు 68.015 కిలోమీటర్ల పొడవున 4 వరుసలుగా ఆధునిక రహదారిని అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.1,641 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు. గతంలో ఈ మార్గం 2 వరుసల రహదారిగా ఉండటంతో పాటు పలుచోట్ల గుంతలు, రద్దీ కారణంగా వరంగల్-కరీంనగర్ మధ్య వాహనదారులు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొనేవారు. కొత్త 4 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభం కానుంది. కొత్త రహదారి వల్ల వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ఇప్పటివరకు ఈ కరీంనగర్-వరంగల్ నగరాల మధ్య ప్రయాణానికి సుమారు గంటన్నర వరకు సమయం పట్టేది. ఈ కొత్త ఎన్‌హెచ్-563 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 45 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తయ్యే అవకాశం ఉంది. రహదారిని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఆధునిక ప్రమాణాలతో నిర్మించినట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌-కరీంనగర్‌ మధ్య దూరం కూడా గతంలో ఉన్న సుమారు 72 కిలోమీటర్ల నుంచి 68 కిలోమీటర్లకు తగ్గనుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, 25 అండర్‌పాస్‌లు నిర్మించారు. మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్‌ ప్రాంతాల వద్ద బైపాస్‌ మార్గాలను అభివృద్ధి చేశారు. స్థానిక గ్రామాలకు రాకపోకలు సులభతరం చేసేందుకు అవసరమైన అప్రోచ్‌ రోడ్లపై కూడా అధికారులు దృష్టి సారించారు. అయితే ఎల్కతుర్తి మండలం బావుపేట క్రాస్‌ వద్ద అండర్‌పాస్‌, సర్వీస్‌ రోడ్డు వంటి కొన్ని సౌకర్యాలపై స్థానికులు అభ్యంతరాలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాలను పరిశీలించి అదనపు సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త ఎన్‌హెచ్-563 హైవేపై ప్రయాణికుల భద్రతకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ నేషనల్ హైవేపై సోలార్‌ ఆధారిత లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటరుకు కెమెరాల ఏర్పాటుతో పాటు అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏటీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకురానున్నారు. రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించేలా మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగట్టు వద్ద ఇప్పటికే టోల్‌ ప్లాజా నిర్మించారు. రహదారి ప్రారంభమైన తర్వాత అక్కడ టోల్‌ వసూలు చేయనున్నట్లు సమాచారం. ప్లాజా వద్ద 24 గంటల పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో పారిశ్రామిక, వాణిజ్య రవాణాకు కూడా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. గ్రానైట్‌, పౌల్ట్రీ, నిర్మాణ రంగానికి సంబంధించిన సామగ్రి రవాణా వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ హైవేపై ట్రయల్‌రన్‌ నిర్వహిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రహదారి పనులను పరిశీలిస్తున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో లేదా దసరా లోపు ఈ కొత్త నేషనల్ హైవేను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
పూర్తి అయిన మరికొన్ని జాతీయ రహదారి ప్రాజెక్టులతో కలిపి ఒకే కార్యక్రమంలో జాతికి అంకితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో తొలిదశలో భూసేకరణ, టెండర్ల కారణంగా కొంత జాప్యం జరిగినప్పటికీ.. ఆ తర్వాత పనులు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం ట్రయల్‌రన్‌ జరుగుతుండటంతో త్వరలోనే ఈ మార్గం పూర్తిస్థాయిలో వాహనదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags: