• కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
• ఎమ్మెల్సీని తక్షణమే బహిష్కరించాలని డిమాండ్
మంచిర్యాల: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత, అమర్యాదకర వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. సోమవారం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పీఠంపై కూర్చున్న ఒక దళిత బిడ్డను అసభ్యకర పదజాలంతో దూషించడం బీఆర్ఎస్ పార్టీ అహంకారానికి, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. పదేళ్ల పాటు అనుభవించిన అధికారాన్ని కోల్పోయిన అసహనంలో ఆ పార్టీ నేతలు రాజ్యాంగ వ్యవస్థలను సైతం గౌరవించడం మానేశారని విమర్శించారు. ఫామ్ హౌస్ నుంచి వస్తున్న ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు.
అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టే పరిస్థితి తీసుకురావడం యావత్ తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి గాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని, మొత్తం దళిత సమాజంపై చేసిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, స్పీకర్ను కించపరిచిన ఎమ్మెల్సీ తాతా మధును శాసన మండలి నుంచి తక్షణమే బహిష్కరించాలని చిట్ల సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు






