తెలంగాణ గళం /హనుమకొండ , సెప్టెంబర్ 20:
కాకతీయుల చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఖిలా వరంగల్ రాతికోట శిథిలావస్థకు చేరుతోంది. కాకతీయులు సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రాతికోటలోని రక్షణ బురుజులు దెబ్బతినడంతో రాళ్లు ధ్వంసమవుతున్నాయి. కోట పరిసరాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడంతో నిర్వహణ అధ్వానంగా మారింది.
రాష్ట్ర రాజముద్రలోనూ చోటు దక్కించుకున్న ఖిలా వరంగల్ కీర్తితోరణాలు, రాతికోటను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతం పర్యాటకులకు అనుగుణంగా అభివృద్ధి చెందకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.
చారిత్రక కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన పురావస్తుశాఖ తగిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాతికోటలో దెబ్బతిన్న బురుజులకు మరమ్మతులు చేపట్టడంతోపాటు, పిచ్చి మొక్కలను తొలగించి కోట పరిసరాలను శుభ్రపరచాలని పర్యాటకులు, చరిత్రకారులు కోరుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఖిలా వరంగల్ రాతికోట పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, చారిత్రక కట్టడాల అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.





