తూర్పుగూడెం రోడ్డుకు రూ.35 లక్షల నిధులు
ఇల్లందు, సెప్టెంబర్ 8 (తెలంగాణ గళం): పెగల్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు హారతులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తూర్పుగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, మండల అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, పెగల్లపాడు సర్పంచ్ కోరం హనుమంతు, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్కినేని మురళీ, ఉపాధ్యక్షుడు హనుమంతురావు, భద్రు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.








