తెలంగాణ గళం,మెట్పల్లి రిపోర్టర్ :
మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట్ గ్రామంలో దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్థులు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి ఆకులను సేకరించారు. అనంతరం గ్రామస్థులు ఒకరికొకరు జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంప్రదాయం గ్రామంలో సోదరభావాన్ని, ఐకమత్యాన్ని చాటిచెప్పింది.
దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో చిన్నారులు, పెద్దలు, మహిళలు, పురుషులు ఉత్సాహంగా కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు, ఆటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామస్థులంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య దసరా వేడుకలను జరుపుకోవడంతో రాజేశ్వర్ రావు పేటలో పండుగ సందడి నెలకొంది.





