విధి నిర్వహణలో వీరుల సేవలు మరువలేనివి
పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 21:
ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరుల సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించడం, నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతలని తెలిపారు. పండుగలు, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ పోలీసులు ప్రజలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి అంకితభావాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అమరవీరుల కుటుంబాలు చేసిన త్యాగాలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.






