పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతోందని పేర్కొన్నారు.
పటాన్‌చెరువులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 160 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,60,18,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతోందని, ప్రజల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారుల కుటుంబాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశాయి.
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు కమ్మెట శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






