ప్రయాణికులకు తప్పని అవస్థలు!
రోడ్డుపై ఇసుక పేరుకుపోయినా పట్టించుకోని అధికారులు..
ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా?
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 15:
పరకాల బస్టాండ్ ఆవరణంలో రోడ్డుపై ఇసుక పేరుకుపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌కు నిత్యం రాకపోకలు సాగించే ప్రజలకు ఇసుక సమస్యగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే అధికారులు మేల్కొనాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించి, బస్టాండ్ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






