దుమ్ముతో దెబ్బతింటున్న పంటలు.. ప్రమాదం అంచున వాహనదారులు!
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 14:
పరకాల నుంచి అంబాల మీదుగా హనుమకొండ వరకు నిర్మిస్తున్న రహదారి రైతులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రహదారిపై కంకర పోసి వదిలేయడంతో వాహనాలు వెళ్లిన ప్రతిసారీ దట్టమైన దుమ్ము లేస్తోంది. ఈ దుమ్ము రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంట పొలాలపై పేరుకుపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుమ్ముతో పంటలకు నష్టం.. వాహనదారులకు ప్రాణసంకటం!
రహదారిపై వాహనం వెళ్లిందంటే చాలు దట్టమైన దుమ్ము మేఘంలా కమ్ముకుంటోందని వాహనదారులు చెబుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పంట పొలాలపై దుమ్ము పేరుకుపోవడంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. ఆకులపై దుమ్ము పేరుకోవడంతో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని పంట ఎదుగుదల మందగిస్తోందని అంటున్నారు.
అధికారులు స్పందించాలి.. దుమ్ము నియంత్రణకు నీళ్లు చల్లాలి!
రహదారి నిర్మాణ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ వెంటనే స్పందించి రహదారిపై క్రమం తప్పకుండా నీళ్లు చల్లి దుమ్మును నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
పంటలను కాపాడటంతో పాటు వాహనదారుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.






