మంచిర్యాల: రాందేవ్ సేవా సమితి సహకారంతో, న్యూ పవన్ ఆప్టికల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య పరీక్షల సంచార (మొబైల్) వ్యాన్ను మంచిర్యాల పట్టణంలోని గర్మిళ్ల హనుమాన్ దేవాలయం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ బద్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు అందించేందుకు ఈ సంచార వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని, పేదలకు నేరుగా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
పేద ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు కస్తూరి నాగరాజు, పట్టి వెంకట కృష్ణ, అమిరిశెట్టి రాజ్ కుమార్, ఆడే ప్రేమ్ సింగ్, వైద్య శ్రీధర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






