తెలంగాణ

మహిళల ఆర్థిక స్వావలంబనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 154 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ స్వయం ఉపాధితో పాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి…

By · · Updated

Share this article
మహిళల ఆర్థిక స్వావలంబనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 154 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

స్వయం ఉపాధితో పాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల, తెలంగాణ గళం అక్టోబర్ 17:

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, ప్రతి కుటుంబం స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, అవసరమైన శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పరకాల పట్టణం, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 154 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన కుట్టు మిషన్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మహిళలు తమ నైపుణ్యాన్ని ఉపాధిగా మార్చుకుని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

కుట్టు మిషన్లతో ఉపాధి.. టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగాలు

ఆధునిక కుట్టు మిషన్లు అందించడంతో పాటు మహిళలకు అవసరమైన శిక్షణ ఇప్పించి, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 

అక్కడ పనిచేసే మహిళలకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా బస్సు సౌకర్యం కల్పించే అంశంపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, పరకాల పట్టణంలో షాదీఖానా నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు.

మైనారిటీ యువతకు శిక్షణ, మహిళలకు ఆర్థిక చేయూత

ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా యోజన, ఈ-మోపెడ్ బైక్‌ల పథకం, రేవంతన్న కా సహారా తదితర కార్యక్రమాల ద్వారా అర్హులైన వారికి సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

2024–25 సంవత్సరానికి సంబంధించిన ఈ-మోపెడ్ బైక్‌ల పథకం ద్వారా రూ.లక్ష విలువైన వాహనాలను 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు వివరించారు.

మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల్లో శిక్షణ అందించడంతో పాటు, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పేరుతో ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళలు, మైనారిటీలు, నిరుపేద కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో మేన శ్రీను, పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: