ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై చర్చించాలి
ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18 వేలు చెల్లించాలి
వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్యూరిటీ గార్డ్ ల ఏజెన్సీ రద్దు చేసి నేరుగా జీతాలు చెల్లించాలి
లక్షేట్టిపేట్‌కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు కలిసి వినతిపత్రం అందజేశారు. సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలలో కార్మికుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, హమాలీ, బిల్డింగ్ వర్కర్లు, ఐకేపీ వీఓఏలు అలాగే ఇతర సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదన్నారు. ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ. 18 వేలు చెల్లించాలని, వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్యూరిటీ గార్డ్ ల సమస్యలను పరిష్కరించి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శోభ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ (సీఐటీయు) జిల్లా నాయకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు






