మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నాయకులు కాళ్లకు, కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గానికి చెందిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి నాయకులు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోని కాంగ్రెస్ అధిష్టానం, బీసీ బిడ్డ అయిన కొండ సురేఖపై చర్యలు తీసుకోవడం అమానుషమని మండిపడ్డారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందని, సామాజిక న్యాయం తమతోనే సాధ్యమని ప్రగల్బాలు పలుకుతున్న పార్టీ ఇపుడు బీసీ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా కొండ సురేఖపై తీసుకున్న బర్తరఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కొండ సురేఖకు బాసటగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని బీసీ సంఘాలు హెచ్చరించాయి. ఈ నిరసన కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, కర్రే లచ్చన్న (న్యాయవాది), రాష్ట్ర నాయకులు గజ్జల్లి వెంకటయ్య, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాచర్ల సదానందం, నాయకులు శాఖ పురి భీమ్సేన్, వేముల అశోక్, వేముల కిరణ్, చంద్రగిరి చంద్రమౌళి, ఎండి లతీఫ్, సురేంద్ర చారి, చెలిమెల అంజయ్య, గగ్గూరి రాజన్న తదితరులు పాల్గొన్నారు





