తెలంగాణ

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అధికారుల అలసత్వమా? ఎనిమిది నెలలుగా రోడ్డు పనులు పెండింగ్!

ఎనిమిది నెలలుగా నత్తనడకన రోడ్డు పనులు.. దుమ్ము ధూళితో ప్రజలకు నరకం! అసంపూర్తి రహదారిపై సీతారాంపురం గ్రామస్తుల నిరసన.. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ పరకాల ,తెలంగాణ గళం ,అక్టోబర్ 23: అధికారుల…

By · · Updated

Share this article
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అధికారుల అలసత్వమా? ఎనిమిది నెలలుగా రోడ్డు పనులు పెండింగ్!

ఎనిమిది నెలలుగా నత్తనడకన రోడ్డు పనులు.. దుమ్ము ధూళితో ప్రజలకు నరకం!

అసంపూర్తి రహదారిపై సీతారాంపురం గ్రామస్తుల నిరసన.. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్

పరకాల ,తెలంగాణ గళం ,అక్టోబర్ 23:

అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ జాప్యంతో పరకాల–అంబాల–హనుమకొండ ప్రధాన రహదారి పనులు ఎనిమిది నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో నిత్యం దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీతారాంపురం గ్రామస్తులు విసిగిపోయి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అసంపూర్తిగా వదిలేసిన రహదారితో గ్రామస్తులు ప్రతిరోజూ నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో దుమ్ము విపరీతంగా లేవడంతో రహదారిపై ప్రయాణించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి దుమ్ము చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. 

దుమ్ము కారణంగా దుకాణాల్లోకి కూడా ధూళి చేరుతుండటంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు.

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కనీసం రోజుకు మూడుసార్లైనా రహదారిపై నీటిని పిచికారీ చేసి దుమ్ము నియంత్రించాల్సి ఉన్నప్పటికీ, ఆ చర్యలు కూడా సక్రమంగా చేపట్టడం లేదని ఆరోపించారు.

ఎనిమిది నెలలుగా రోడ్డు పనులు పూర్తి చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని, అప్పటివరకు దుమ్ము నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్తులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Tags: