రూ.5,420 కోట్ల విద్యుత్ బిల్లుల భారం ప్రజలపై మోపడం అన్యాయం: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల తెలంగాణ గళం, అక్టోబర్ 16:
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.
శుక్రవారం పరకాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి విద్యుత్ రంగంపై స్పష్టమైన అవగాహన, వ్యవసాయంపై సరైన ప్రణాళిక లేదని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతోపాటు పరకాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, చెక్‌డ్యాంల నిర్మాణంతో సాగునీటి వసతులను మెరుగుపరిచారని గుర్తుచేశారు.
ప్రస్తుతం విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
నీళ్లున్నా.. ఎండుతున్న పంటలు!
కన్నెపల్లిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ మోటార్లు నడపకపోవడంతో పంటలకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు.
చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఏర్పడిన కృత్రిమ కరువని విమర్శించారు.రూ.5,420 కోట్ల భారం ఎందుకు?
విద్యుత్ కోతలను తక్షణమే నివారించి, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని పెంచి విద్యుత్ అవసరాలను తీర్చాలని సూచించారు. రూ.5,420 కోట్ల విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రజలపై మోపే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
రైతుల పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలపై అదనపు విద్యుత్ బిల్లుల భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.






