తెలంగాణ

గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు   గుడుంబా స్వాధీనం.. వాహనాల తనిఖీలు.. సైబర్ నేరాలపై అవగాహన   గార్ల, సెప్టెంబర్ 9:(తెలంగాణ గళం)     గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతంపేట గ్రామంలో పోలీస…

By · · Updated

Share this article
గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

 

గుడుంబా స్వాధీనం.. వాహనాల తనిఖీలు.. సైబర్ నేరాలపై అవగాహన

 

గార్ల, సెప్టెంబర్ 9:(తెలంగాణ గళం)

 

 

గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతంపేట గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. గార్ల-బయ్యారం సీఐ రవీందర్ తో కలిసి గార్ల ఎస్సై సాయికుమార్ గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని, గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు.

 

గ్రామంలో గుడుంబా తయారీ, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తనిఖీల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, గుడుంబా తయారీకి ఉపయోగించే 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీకి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గుడుంబా తయారీ వల్ల ప్రజల ఆరోగ్యానికి, కుటుంబాల ఆర్థిక పరిస్థితికి తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు.

 

అదేవిధంగా గ్రామంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 34 ద్విచక్ర వాహనాలు, ఆటోలను గుర్తించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, నంబర్ ప్లేట్లు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులకు సైబర్ నేరాల నివారణ, గంజాయి వ్యతిరేక చర్యలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు లేదా లింకులు వచ్చినప్పుడు స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

 

గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులను కోరారు. గంజాయి, గుడుంబా వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలను గోప్యంగా తెలియజేయవచ్చని చెప్పారు. ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణకు, నిందితులను గుర్తించేందుకు సహకారం అందుతుందని వివరించారు.

 

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు భాగస్వాములు కావాలని కోరారు.