రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్ల వినియోగం: ఆత్మకూరు ఇన్స్పెక్టర్ బాబులాల్
ఆత్మకూర్, తెలంగాణ గళం, సెప్టెంబర్ 10:
గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ఆత్మకూరు పోలీస్ ఇన్స్పెక్టర్ బాబులాల్ సూచించారు.
గురువారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుతో ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగిన ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలన్నారు. మండపం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని తెలిపారు. గణేష్ మండపం వద్ద 24 గంటలూ కనీసం ఒక వాలంటీర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద పేకాట, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు.
ప్రతి మండపం వద్ద పాయింట్ బుక్ ఏర్పాటు చేసి, పోలీసుల సూచనలు, తనిఖీల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఏదైనా సమస్య లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
అలాగే తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో గణేష్ మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని ఇన్స్పెక్టర్ బాబులాల్ కోరారు.
ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్సై తిరుపతితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






