తెలంగాణ గళం,సెప్టెంబర్ 10:
దామెర మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు దామెర ఎస్ఐ వీరభద్రరావు పలు సూచనలు చేశారు.
గణేష్ మండపాల ఏర్పాటుకు ముందుగా తప్పనిసరిగా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ వైర్లు, లైటింగ్ ఏర్పాటు విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మండపాల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
విగ్రహ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని, డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండప నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్ఐ వీరభద్రరావు కోరారు.






