బీజేపీ నాయకుల డిమాండ్
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 31:
ఉక్కుమనిషి, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా పరకాల పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డా. సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని కొనియాడారు.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన పరకాల పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం లేకపోవడం విచారకరమని అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో అనువైన స్థలాన్ని కేటాయించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులను డిమాండ్ చేశారు. విగ్రహ ఏర్పాటు ద్వారా భావితరాలకు దేశభక్తి, జాతీయ సమైక్యత, ఐక్యతా భావాన్ని చాటిచెప్పే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుక్కల విజయ్ కుమార్, ఆకుల లావణ్య శ్రీధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.పి. జంతిలాల్, నాయకులు చందుపట్ల రాజేందర్ రెడ్డి, మిడిదొడ్డి నరేష్, సంఘ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.






