దసరా విధుల్లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి..
కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్ శ్రీలతపై దాడి.. కుడిచేయి విరిగి తీవ్ర గాయం!
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 22
దసరా వేడుకల సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజిపేటలో చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకునే ప్రయత్నంలో మహిళా కానిస్టేబుల్ గిన్నె శ్రీలత గాయపడింది.
ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజిపేటలో దసరా వేడుకల సందర్భంగా మహిళా కానిస్టేబుల్ గిన్నె శ్రీలత విధుల్లో ఉన్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆమె ప్రయత్నించారు. గొడవలో భాగంగా కత్తితో వచ్చిన వ్యక్తిని అడ్డుకునే క్రమంలో ఆమెను నెట్టివేయడంతో కుడిచేయి విరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిని నవీన్, రాజు, పెద్ద రాజయ్య, గువ్వ క్రాంతి అనే నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పవన్ తెలిపారు.
ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






