
అధికారులతో సమీక్షించిన జువ్వాడి నర్సింగరావు
మెట్‌పల్లి, అక్టోబర్ 16,తెలంగాణ గళం:
దసరా, బతుకమ్మ పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సూచించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డులో దసరా ఉత్సవాలు నిర్వహించే ప్రదేశాన్ని, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలోని బతుకమ్మ నిమజ్జన స్థలాన్ని మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పండుగల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. దసరా, బతుకమ్మ పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. పండుగలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మార్కెట్ యార్డులో నిర్వహించే దసరా ఉత్సవాలు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో జరిగే బతుకమ్మ నిమజ్జన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
పోలీస్ శాఖ అధికారులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ అధికారులు పండుగ ప్రదేశాల్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పండుగలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యంతో దసరా, బతుకమ్మ వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని జువ్వాడి నర్సింగరావు స్పష్టం చేశారు.





