హసన్పర్తి , అక్టోబర్ 26, (తెలంగాణ గళం):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని హసన్పర్తి ప్రాంతంలో పలువురు వార్డు ఆఫీసర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, 50 ఏళ్లు దాటిన గీత కార్మికులతో పాటు దివ్యాంగుల కేటగిరీల కింద అర్హత కలిగిన పేద ప్రజలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారి అర్హతలను కాక, చేతి నిండా ఇచ్చే 'మామూళ్ల'ను చూసి అధికారులు ఫైళ్లు కదుపుతున్నట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్హత ఉన్నా తప్పని తిప్పలు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం హసన్పర్తి పరిధిలో పెన్షన్ పొందడానికి అన్ని రకాల అర్హతలు, ధృవీకరణ పత్రాలు ఉన్నప్పటికీ, వార్డు స్థాయి అధికారులు మాత్రం దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే ఓపిక లేక, లంచాలు ఇచ్చుకోలేక వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో అర్హతలు సరిగ్గా లేకపోయినా, అడిగినంత డబ్బులు ఇచ్చుకున్న వారికి మాత్రం దరఖాస్తులు చకచకా అప్రూవల్ అయిపోతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. డబ్బులు ఇవ్వని వారి దరఖాస్తులను ఏదో ఒక వంకతో పెండింగ్లో ఉంచుతూ కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా?
పేదలకు అండగా ఉండాల్సిన హసన్పర్తి క్షేత్రస్థాయి యంత్రాంగం ఇలా అవినీతికి పాల్పడుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు, స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. హసన్పర్తి పరిధిలోని వార్డుల్లో పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలి. లంచాలు డిమాండ్ చేస్తూ, అర్హులను ముప్పతిప్పలు పెడుతున్న వార్డు ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన లబ్ధిదారులందరికీ తక్షణమే పెన్షన్లు అందేలా చూడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






