తెలంగాణ

​చెమటోడ్చిన కార్మికులకు పట్టని పెన్షన్.. ఐదేళ్లు పనిచేసే నేతలకు డబుల్ పెన్షన్లా? : సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం

శ్రీరాంపూర్ (మంచిర్యాల): ప్రజల ఓట్లతో గెలిచి కేవలం ఐదేళ్లు ప్రజాప్రతినిధులుగా పనిచేసే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల పన్నుల సొమ్ముతో రెండు పెన్షన్లు చెల్లించడాన్ని వెంటనే రద్దు చేయాలని, దశాబ్దాల పాటు భూగ…

By · · Updated

Share this article
​చెమటోడ్చిన కార్మికులకు పట్టని పెన్షన్.. ఐదేళ్లు పనిచేసే నేతలకు డబుల్ పెన్షన్లా? : సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం

శ్రీరాంపూర్ (మంచిర్యాల): ప్రజల ఓట్లతో గెలిచి కేవలం ఐదేళ్లు ప్రజాప్రతినిధులుగా పనిచేసే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల పన్నుల సొమ్ముతో రెండు పెన్షన్లు చెల్లించడాన్ని వెంటనే రద్దు చేయాలని, దశాబ్దాల పాటు భూగర్భ గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి శ్రమించిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ అమలు చేయాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే-6 లక్ష్మీనగర్ కొత్త గుడిసెలలో నిర్వహించిన సంఘం సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ప్రతి మూడేళ్లకోసారి పెన్షన్ సమీక్షించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, గత 28 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం ఒక్క శాతం కూడా పెన్షన్ పెంచకపోవడం అన్యాయమన్నారు. ఫలితంగా నేటికీ నెలకు రూ. 350 నుంచి రూ. 1,000 మాత్రమే పొందుతూ విశ్రాంత కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, సరైన వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 15,000గా నిర్ణయించాలని, సీపీఆర్ఎంఎస్ వైద్య పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచాలని, అధికారులతో సమానంగా కార్మికులకు కూడా 2017 నుంచే రూ. 20 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

​పెన్షనర్ల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 09-09-2026 (బుధవారం) ఉదయం 9 గంటల నుంచి నస్పూర్‌లోని సింగరేణి గార్డెన్‌లో నిర్వహించనున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనానికి శ్రీరాంపూర్ జీఎంతో పాటు సీఎంపీఎఫ్ ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ఉపాధ్యక్షులు జి. గంగయ్య, ఎన్. సదాశివ చారి, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, కోశాధికారి బింగి రాజేశం, సంఘం నాయకులు బెక్కం రామయ్య, ఎం. కొమురయ్య, మూల సాంబయ్య, కల్వల బొంగయ్య, రేణికుంట్ల చంద్రయ్య, గంధం రమేష్ తదితరులు పాల్గొన్నారు

Tags: