:
బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మంచిర్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక న్యాయం, రెడ్డి సామాజిక వర్గానికి మరో న్యాయం కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు పార్టీని బహిరంగంగా విమర్శించినా ఎలాంటి చర్యలు తీసుకోని హైకమాండ్, బీసీ మహిళా మంత్రి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల రాజ్యం నడుస్తోందని, బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఓట్ల కోసం బీసీలను ఉపయోగించుకుని, అధికారంలోకి వచ్చాక అణగదొక్కే ధోరణిని ఇకపై సహించేది లేదని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే నిర్ణయాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్, బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా నాయకులు బియ్యాల సత్తయ్య, జక్కం రవీందర్, పట్టణ నాయకులు వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్, ఎండి షఫీ, కొడుకా మోహన్, పల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు






