తెలంగాణ

వెయ్యి రోజుల పాలన.. అభివృద్ధిపై కనకయ్య ధీమా

బీఆర్‌ఎస్‌ నిరసనలపై ఎమ్మెల్యే ఫైర్‌.. ‘‘పదేళ్లలో ఇల్లందుకు ఏం చేశారో చెప్పాలి’’ ఇల్లందు, సెప్టెంబర్‌ 5 (తెలంగాణ గళం): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పేదలు, రైతులు, మహిళల సంక్షేమంతో పాటు ఇల…

By · · Updated

Share this article
వెయ్యి రోజుల పాలన.. అభివృద్ధిపై కనకయ్య ధీమా

బీఆర్‌ఎస్‌ నిరసనలపై ఎమ్మెల్యే ఫైర్‌.. ‘‘పదేళ్లలో ఇల్లందుకు ఏం చేశారో చెప్పాలి’’

ఇల్లందు, సెప్టెంబర్‌ 5 (తెలంగాణ గళం): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పేదలు, రైతులు, మహిళల సంక్షేమంతో పాటు ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. వెయ్యి రోజుల ప్రజా పాలనను పురస్కరించుకుని ఇల్లందు మున్సిపాలిటీ మార్కెట్‌యార్డులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్‌ కట్‌ చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

‘‘పేదలకు జరుగుతున్న మేలు బీఆర్‌ఎస్‌ నాయకులకు కనిపించడం లేదా?’’ అని కనకయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించకుండా ధర్నాలు, వంటావార్పుల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఇల్లందు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని సవాల్‌ చేశారు. సీతారామ జలాలు అందిస్తామని గతంలో హామీలు ఇచ్చినా ఆచరణలో ప్రజలకు సాగునీరు అందలేదని విమర్శించారు.

ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్నబియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, అర్హులకు సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి సాయం అందిస్తున్నామని చెప్పారు.

నియోజకవర్గ అభివృద్ధికి రూ.800 కోట్లతో పనులు

ఇల్లందు నియోజకవర్గంలో రోడ్లు, వంతెనలు, అంతర్గత రహదారులు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.800 కోట్లతో పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 4,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో 2,000 ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సుమారు లక్ష కుటుంబాలకు రేషన్‌ కార్డులు అందించినట్లు పేర్కొన్నారు.

సీతారామ జలాలపై స్పష్టత

ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు జలాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కనకయ్య స్పష్టం చేశారు. ఈ అంశాన్ని గతంలోనే శాసనసభలో ప్రస్తావించానని తెలిపారు. మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సాగునీరు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు సూచించారు. ప్రజలకు అందుతున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పనితీరును వివరించాలని కోరారు. రాష్ట్రంలో మరోసారి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు కోరం సురేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోత్‌ రాంబాబు, పురపాలక చైర్మన్‌ దొడ్డా కిరణ్‌ మిత్రా డానియల్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ మంగీలాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.