అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
ఆటపాటలతో కోగిలవాయిలో పండుగ సందడి!
సర్పంచ్ చుక్క వనిత మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 19
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు దామెర మండలం కోగిలవాయి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ చుక్క వనిత మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామంలోని ఆడపడుచులంతా ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.
పండుగను పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఆడపడుచుల ఆటపాటల కోసం డీజే సౌండ్‌తో పాటు కలర్ బల్బుల వెలుగులతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది. గ్రామ ఉపసర్పంచ్ పెనుకుల ప్రశాంత్, గ్రామ సిబ్బంది, విద్యుత్ లైన్‌మెన్ కృష్ణ ఏర్పాట్లలో సహకరించారు.
శ్రీ చెన్నకేశవ భజన భక్త మండలి సభ్యులు సతీసమేతంగా పేర్చిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందంగా అలంకరించిన బతుకమ్మను చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
గ్రామంలో గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరిగాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు కోగిలవాయి గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.






