పరకాల మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనం.. 10వ వార్డులో విషపురుగులకు నిలయంగా మారిన ఖాళీ స్థలం
పరకాల మున్సిపాలిటీ 10వ వార్డు వైనాల వీధిలో ఖాళీ స్థలం విషపురుగులకు, విష సర్పాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీ స్థలంలో మనిషి ఎత్తుకు మించి పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగిపోయి అడవిని తలపిస్తోంది. దీంతో పాములు, తేళ్లు, విషపురుగులు చుట్టుపక్కల ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఆ ప్రాంతంలో చిన్న పిల్లలు ఉండటంతో తల్లిదండ్రులు భయాందోళనలో ఉన్నారు. దోమల బెడద కూడా విపరీతంగా పెరిగిందని వాపోతున్నారు.
ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్, కమిషనర్, స్థానిక కౌన్సిలర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
మున్సిపాలిటీ వారు తక్షణమే స్పందించి ఖాళీ స్థలంలోని పిచ్చి మొక్కలను తొలగించి, యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






