వ్యవసాయ పొలంలోనే కుప్పకూలిన కుమారస్వామి.. కుటుంబంలో విషాదం
పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 15:
వ్యవసాయ పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన ఓ పాలేరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన పరకాల మండలంలో చోటుచేసుకుంది.
మలక్‌పేట గ్రామానికి చెందిన రాసమల్ల కుమారస్వామి (45) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మలక్‌పేట హనుమాన్ దేవాలయం సమీపంలోని వ్యవసాయ పొలంలో జరిగింది.
గ్రామస్తుల వివరాల ప్రకారం..
మలక్‌పేటకు చెందిన కుమారస్వామి మాదారం శివారు ప్రాంతానికి చెందిన రైతు పిట్ట సమ్మయ్య వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా మంగళవారం ఉదయం పొలానికి వెళ్లాడు. వ్యవసాయ మోటార్‌ను ఆన్ చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు.
కుమారస్వామికి విద్యుదాఘాతం తగిలిన విషయాన్ని రైతు పిట్ట సమ్మయ్య భార్య గ్రామస్తులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే కుమారస్వామి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నిరుపేద రజక కుటుంబానికి చెందిన కుమారస్వామి మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
వ్యవసాయ పొలాల్లో విద్యుత్ మోటార్లు, వైర్లు, విద్యుత్ పరికరాల వద్ద భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






