తెలంగాణ గళం/హనుమకొండ, (సెప్టెంబర్ 19):
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.
ఆసుపత్రిలోని వివిధ వార్డులను తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో పారిశుధ్యం, మౌలిక వసతులు, మందుల కొరత తదితర అంశాలపై రోగులు మరియు వారి బంధువులతో కడియం శ్రీహరి గారు మాట్లాడారు.
అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఇతర సీనియర్ వైద్యులతో కలిసి ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పేద ప్రజలకు ఎల్లప్పుడూ మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర విభాగాల్లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





