తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు డిమాండ్
పరకాల, సెప్టెంబర్ 10 (తెలంగాణ గళం):
పరకాల నియోజకవర్గ పరిధిలో గత వారం రోజులుగా రాత్రివేళల్లో తరచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు అన్నారు.
విద్యుత్ కోతలను వెంటనే నివారించి, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని కోరుతూ గురువారం పరకాల విద్యుత్ శాఖ ఏడీకి వరికెల కిషన్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సురావు బాబురావుతో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వరికెల కిషన్ రావు మాట్లాడుతూ.. గత వారం రోజులుగా ప్రతిరోజూ రాత్రి వేళల్లో సుమారు 40 నుంచి 60 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని తెలిపారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, దీంతో వ్యవసాయ మోటార్లు నడపలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం తదితర కారణాలతో రైతులు పంటల విషయంలో ఆందోళన చెందుతున్నారని, దీనికి తోడు విద్యుత్ కోతలు వారి కష్టాలను మరింత పెంచుతున్నాయని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ అందకపోవడంతో పంటలకు సాగునీరు అందించడం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు.
విద్యుత్ కోతలతో రైతులతో పాటు పిల్లలు, వృద్ధులు, మహిళలు, సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాత్రివేళల్లో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యవసాయానికి అవసరమైన సమయంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
రైతుల సమస్యను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించాలని వరికెల కిషన్ రావు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సురావు బాబురావు పాల్గొన్నారు.






