పరకాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు, వసతులు మెరుగ్గా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 08:
పరకాలలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ మేల్, ఫిమేల్ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, యాంటీ నేటల్ వార్డ్, లేబర్ రూమ్, పోస్ట్ నేటల్ వార్డులతో పాటు మొదటి అంతస్తులోని గదులను పరిశీలించారు.
ఆశా కార్యకర్తలు గర్భిణీల వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేస్తున్న తీరును పరిశీలించారు. ఆసుపత్రి ముందున్న ఖాళీ స్థలం, పక్కనే ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, పాత ఎంపీడీవో కార్యాలయ గదులను, నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూడా పరిశీలించి ఆసుపత్రి అవసరాలకు వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో విభాగాల పేర్లతో సైన్ బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని, ఫిజియోథెరపీ, బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాలకు అనుకూలంగా గదులు కేటాయించాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఆసుపత్రి ముందు ప్లాంటేషన్, బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వంశీకృష్ణ, ఆర్ఎంవోలు డా. నారాయణ రెడ్డి, డా. బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ పవన్, ఆర్డీవో వెంకన్న, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ నందూ పటేల్, తహసిల్దార్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.





