హసన్‌పర్తి, (తెలంగాణ గళం) అక్టోబర్ 4:
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని బాలాజీనగర్‌లో ఆదివారం ఒక ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాము నుండి ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివసిస్తున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను, ప్రమాద తీవ్రతను స్థానికులు మరియు అగ్నిమాపక, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ — ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మంటలను త్వరగా అదుపులోకి తెచ్చేలా అన్ని చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు నగరంలోని స్క్రాప్ గోదాములు, పరిశ్రమలలో తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సిలువేరు శ్రీనివాస్, నాయకులు శంకర్, కుమార్, రవి, జావిద్, రాజేష్‌లతో పాటు డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మోడెం సందీప్






