తెలంగాణ

పెళ్లి పేరుతో నమ్మించి ఘాతుకం

తెలంగాణ గళం (హసన్‌పర్తి)తేదీ: 13 సెప్టెంబర్, 2026 వయసు తేడాను పక్కనపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ నమ్మకంతోనే ఆమెను సుదూర ప్రాంతానికి రప్పించాడు. చివరకు ఆమె ఆశలను అడియాసలు చేస్తూ, కామ వాంఛక…

By · · Updated

Share this article
పెళ్లి పేరుతో నమ్మించి ఘాతుకం

తెలంగాణ గళం (హసన్‌పర్తి)తేదీ: 13 సెప్టెంబర్, 2026

వయసు తేడాను పక్కనపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ నమ్మకంతోనే ఆమెను సుదూర ప్రాంతానికి రప్పించాడు. చివరకు ఆమె ఆశలను అడియాసలు చేస్తూ, కామ వాంఛకు అడ్డుగా మారుతుందనో లేక బంధం బయటపడుతుందనో అత్యంత కిరాతకంగా పీకపిసికి హత్య చేశాడు. ఆపై దారుణానికి సాక్ష్యం ఉండకూడదన్న దురాలోచనతో మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి అడవిలో పడేసిన అత్యంత పాశవిక ఘటన హసన్‌పర్తి పరిధిలో కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉత్కంఠభరిత క్రైమ్ మిస్టరీ వివరాలను పోలీసులు మీడియా ముందు బట్టబయలు చేశారు.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన తౌటం స్వప్న (40) గత కొంతకాలంగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యంగా నమోదైన ఈ కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూపీ లాగగా కళ్లు బైర్లుగలిగే నిజాలు బయటపడ్డాయి.

 

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన వొద్దిరాజుల బసవరాజు (27) అనే యువకుడితో స్వప్నకి పరిచయం ఏర్పడింది. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనప్పటికీ, బసవరాజు ఆమెతో ప్రేమ నాటకం ఆడాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే బసవరాజు మాటలను గుడ్డిగా నమ్మిన స్వప్న.. అతడిని కలిసేందుకు బళ్లారికి వెళ్ళింది.

 

అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత వారి మధ్యేే వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పథకం ప్రకారమే బసవరాజు ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. బళ్లారిలో ఏకాంతంగా ఉన్న సమయంలో స్వప్న గొంతును గట్టిగా పీసికి అతి క్రూరంగా హత్య చేశాడు.

 

ప్రాణం తీయడంతోనే ఆగకుండా, ఆ రాక్షసుడు మరింత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతదేహం ఎవరికీ గుర్తుపట్టకుండా ఉండేందుకు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పదునైన ఆయుధంతో డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం ఆ శరీరభాగాలను ఎవరి కంటపడకుండా సమీపంలోని దట్టమైన అడవి ప్రాంతంలో వేర్వేరు చోట్ల పడేసి పరారయ్యాడు.

 

కేసు దర్యాప్తును వేగవంతం చేసిన హసన్‌పర్తి పోలీసులు నిందితుడి కదలికలను పసిగట్టారు. శుక్రవారం ఉదయం అంబాల – కమలాపూర్ రోడ్డు ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడు బసవరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు కక్కాడు. హత్యకు ఉపయోగించిన తీరు, మృతదేహాన్ని పారవేసిన వైనంపై అతడు ఇచ్చిన వాంగ్మూలం చూసి పోలీసులే విస్మయానికి గురయ్యారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతడి నుంచి కీలకమైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దారుణ హత్యకు గురైన స్వప్న మృతదేహావశేషాలను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.