లక్షెట్టిపేట పట్టణంలో మంత్రాల పేరుతో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడిన జ్యోతిష్యుడు పెండెం సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్సెట్టిపేట పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో, జాతకాలు చూసి నయం చేస్తాడనే నమ్మకంతో సెప్టెంబర్ 8న లక్షేట్టిపేట గోదావరి రోడ్డుకు చెందిన పెండెం సతీష్ వద్దకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇదే అదునుగా భావించిన నిందితుడు బాలికను పూజా గది పక్కకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేశాడు. విషయం బయటపెడితే చంపుతానని బెదిరించడంతో భయపడిన బాధితురాలు ఆ రోజు ఏమీ చెప్పలేదు. తిరిగి సెప్టెంబర్ 10న బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం తెలపడంతో, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసును సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఉత్తర్వులు, ఏసీపీ ఆర్. ప్రకాష్ పర్యవేక్షణలో లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ మరియు సిబ్బంది చాకచక్యంగా చేదించారు. ఈ దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్‌తో పాటు ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్, హెచ్‌సీ వసంత్, పీసీలు సుధాకర్, రాజమౌళి, సత్యనారాయణ, మల్లేష్, కుమారస్వామి, సాంబరి రమేష్, రవీందర్, బానావత్ రమేష్, మహేష్, తిరుపతి, శ్రీకాంత్, ప్రేం సాగర్, సాగర్, డబ్ల్యూపీసీలు మనీషా, ప్రవలికలను సీపీ మరియు డీసీపీ అభినందించారు. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, అనారోగ్య సమస్యలు వస్తే అర్హత గల వైద్యులను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు





