మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ షిర్కే కాలనీలో శ్రీ లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భారీ గణనాథుని ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధర్ని మధుకర్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ శ్రీ తూముల నరేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మేయర్ గారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన భారీ గణేశుని ర్యాలీని ప్రారంభించి, భక్తులతో కలిసి సందడి చేశారు. ఈ ర్యాలీలో దేవునికి నైవేద్యంగా సమర్పించిన భారీ 40 కిలోల లడ్డూను మేయర్ శ్రీ ధర్ని మధుకర్ స్వయంగా మోసుకుంటూ ముందుకు సాగడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా గత 23 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తూ భక్తి, ఐక్యతను చాటుతున్న శ్రీ లక్ష్మీ గణేష్ మండలి సభ్యులను మేయర్ అభినందించారు. ఈ గణేష్ ఉత్సవాలు కార్పొరేషన్లోని ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మర్రి శ్రీలత రాజమొగిలి, అగ్గు సాగర్, గణేష్ మండలి సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, భక్తులు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు






