
మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్.హెచ్. 63 గ్రీన్ ఫీల్డ్ హైవే కింద భూములు కోల్పోతున్న లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన సుమారు 150 మంది రైతులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద సర్వం కోల్పోయామని, ఇప్పుడు ఈ హైవే ద్వారా తమకున్న కొద్దిపాటి భూమిని కూడా తీసుకుంటే బ్రతుకులు ఆగమమవుతాయని రైతులు వాపోయారు. రైతుల కష్టాలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.. గ్రీన్ ఫీల్డ్ హైవేలో రైతుల భూములు కోల్పోకుండా చూస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి, రైతులను ఇబ్బంది పెట్టవద్దని, నోటీసులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ గ్రామసభలు నిర్వహించాలని, ఆ ప్రతి గ్రామసభకు తానే స్వయంగా వస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో, తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు






