పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 29:
పరకాల, మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరకాల ఆర్డీవో డి.ఎస్. వెంకన్న పిలుపునిచ్చారు.
మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, కార్మిక శాఖల అధికారులకు సమీక్ష, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, బలహీన వర్గాలను ప్రలోభపెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, అసంఘటిత కార్మికులను వెట్టిచాకిరీలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో డివిజన్ స్థాయి విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ నుంచి డాక్టర్ ఆనంద్ రిసోర్స్ పర్సన్ గా పాల్గొని అవగాహన కల్పించారు. ఎఫ్ఎంఎం కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, ఇక్బాల్ పాషా, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్ఐలు, కార్మిక శాఖ అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






