పాలకులు – అధికారుల ‘మైనింగ్’ గుట్టు.. శివయ్యకే ఎరుక!
మూడు గ్రామాల నడుమ అక్రమ క్రెషర్లు.. నిద్రలేని రాత్రుల్లో సరిహద్దు ప్రజలు.
విధ్వంసమవుతున్న చారిత్రక కొలను.. మట్టిపాలవుతున్న పవిత్ర తీర్థం.
రాత్రిపూట లారీల మోత, ధూళి మేఘాలతో గుండె రోగుల విలవిల:
హాసన్పర్తి మండలంలో మూడు గ్రామాల ప్రజల ఆర్తనాదాలు.
పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై నిరసన జ్వాలలు.
తెలంగాణగళం, (హాసన్పర్తి):అక్టోబర్ 7:
హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలం పరిధిలోని చింతగట్టు, జయగిరి, మునిపల్లి గ్రామాల సరిహద్దుల్లో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ‘బోడగట్టు’ ప్రస్తుతం అక్రమ క్రెషర్లు, నిరంతర బ్లాస్టింగ్ల ధాటికి ధ్వంసమవుతోంది. గుట్టను క్రెషర్ల నిర్ నిర్దాక్షిణ్యంగా పిండి పిండి చేస్తుండటంతో ప్రకృతి సౌందర్యంతో పాటు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది.
చట్టాలు ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడటానికి ఉన్నాయా? లేక వ్యాపారుల జేబులు నింపడానికి వంగిపోతున్నాయా? అనే దానికి అద్దం పడుతోంది హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలంలోని ‘బోడగట్టు’ విధ్వంసం. చింతగట్టు, జయగిరి, మునిపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉంటూ, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గుట్టపై క్రెషర్ల దందా సాగుతుంటే పాలకులు, అధికారులు మౌనం వహించడం వెనుక పక్కా సూత్రధారులు ఉన్నారని స్థానికులు మండిపడుతున్నారు.
అనుమతుల వెనుక "అనుమానాల" పుట్ట:
మూడు గ్రామాల నడుమ, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేలా ఉన్న ఈ గుట్టకు మైనింగ్ పర్మిషన్లు ఎలా వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. పర్యావరణ అనుమతులు, గనుల శాఖ నిబంధనలు అన్నీ బొందపెట్టి, అధికారుల అండదండలతోనే ఈ విధ్వంసం సాగుతోందన్నది ప్రత్యక్ష సత్యం. చారిత్రక కోనేరును ధ్వంసం చేసి, భక్తుల నమ్మకాలను అణచివేస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు వచ్చి సమీక్షించిన దాఖలాలు లేవు.
ధ్వంసమైన పవిత్ర కొలను:
బోడగట్టుపై పూర్వం నుండి ఒక పవిత్రమైన కోనేరు (కొలను) ఉండేది. ఈ కొలనులోని నీటితోనే స్వామివారికి అభిషేకం చేసేవారు. మట్టి తవ్వేకొద్దీ స్వచ్ఛమైన ఊట నీరు రావడం ఇక్కడి ప్రత్యేకత. ఈ పవిత్ర జలాన్ని సేవిస్తే రోగాలు, ఆర్థిక బాధలు, సమస్త సమస్యలు తొలగిపోతాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజల గట్టి నమ్మకం. అయితే, ఇటీవల జరిగిన విచక్షణారహిత బ్లాస్టింగ్ లతో ఈ చారిత్రక కోనేరు పూర్తిగా ధ్వంసమైంది. కొలను ఉనికి కోల్పోవడంతో "శివయ్యే కన్నీరు పెడుతున్నాడంటూ" స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి లారీల మోత.. రోగుల విలవిల:
క్రెషర్ల నిర్వాకం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారాయి. రాత్రి వేళల్లో లారీలు వేగంగా వెళ్తుండటంతో వచ్చే భారీ శబ్దాలకు జనాలు భయాందోళనకు గురై బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ధూళి, కాలుష్యం పెరిగిపోవడంతో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇక్కడ బ్రతకడమే కష్టంగా మారిందని రోగ నిట్టూరుస్తున్నారు. కంటినిండా నిద్రలేక, స్వచ్ఛమైన గాలి పీల్చలేక స్థానికులు అలమటిస్తున్నారు.
పట్టించుకోని పాలకులు, అధికారులు:
ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు అధికారంలో ఉన్నా ఈ గుట్ట విధ్వంసాన్ని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారా? లేక తమ స్వంత ప్రయోజనాలు, ఖజానాలు నింపుకోవడానికే పరిమితమయ్యారా? అని స్థానికులు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బోడగట్టుపై జరుగుతున్న అక్రమ తవ్వకాలను, బ్లాస్టింగ్ లను తక్షణమే నిలిపివేయాలని, పర్యావరణాన్ని, చారిత్రక సాంప్రదాయాలను కాపాడాలని గ్రామీణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం:
మనుషుల ప్రాణాల కంటే, పవిత్రమైన శివుని కొలను కంటే వ్యాపారుల కమీషన్లే పాలకులకు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారుల గుట్టు, పాలకుల స్వార్థం శివుడికి తెలుసో లేదో గానీ, నిత్యం భయంతో కాలం వెళ్లదీస్తున్న గ్రామీణులకు మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. తక్షణమే ఈ మైనింగ్ అనుమతులను రద్దు చేసి, క్రెషర్లను మూసివేయకపోతే మూడు గ్రామాల ప్రజలు ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నారు.






