తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను విస్తరిస్తోంది. తాజాగా 73 టీపీఎస్‌ల నిర్మాణానికి రూ.699.89 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో రూ.209.96 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, రూ.489.93 కోట్లు ఏఐఐబీ రుణంగా సమకూరనున్నాయి. దీంతో ఇప్పటివరకు అనుమతులు పొందిన టీపీఎస్‌ల సంఖ్య 78కు చేరింది. క్రీడా మైదానాలు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ప్రత్యేక ఆట స్థలాలతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో వీటిని అభివృద్ధి చేయనున్నారు.
హైలైట్:
ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులు
కొత్తగా 73 టీపీఎస్‌ల ఏర్పాటు
ఒకే క్యాంపస్‌లో వెయ్యి మంది విద్యార్థులు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త రూపు ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటును వేగవంతం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు దీటుగా టీపీఎస్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా 73 టీపీఎస్‌ల నిర్మాణానికి తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ పాఠశాలల నిర్మాణానికి మొత్తం రూ.699.89 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందులో రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.209.96 కోట్లు కేటాయించగా.. మరో రూ.489.93 కోట్లను ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) రుణంగా సమకూర్చనుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి నిర్మాణ ప్రక్రియను వేగంగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలలోనే నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నట్లు టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గత ఫిబ్రవరిలో నిర్ణయించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, అచ్చంపేట నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున, గజ్వేల్‌లో ఒక టీపీఎస్‌కు అనుమతులు లభించాయి. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆరుట్ల టీపీఎస్ ఇప్పటికే ప్రారంభమైంది. మిగిలిన పాఠశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతిపాదించిన 95 పాఠశాలల్లో 73కి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఇప్పటివరకు మంజూరైన టీపీఎస్‌ల సంఖ్య 78కు చేరింది. మిగిలిన పాఠశాలలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు భిన్నంగా టీపీఎస్‌లు సెమీ రెసిడెన్షియల్ విధానంలో పనిచేయనున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కూడా అవసరమైన మౌలిక వసతులతో టీపీఎస్‌లుగా తీర్చిదిద్దనున్నారు. సాధారణంగా కనీసం రెండు నుంచి మూడు ఎకరాల స్థలం ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి.. వాటి పరిధిలోని సమీపంలోని మరో రెండు, మూడు పాఠశాలలను విలీనం చేసే విధానాన్ని అనుసరించనున్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమీపంలోని జూనియర్ కళాశాలలను కూడా ఈ సముదాయాల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
టీపీఎస్‌లలో విద్యార్థులకు తరగతి గదులతో పాటు క్రీడా మైదానాలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు, గ్రంథాలయాలు, కంప్యూటర్-సైన్స్ ల్యాబ్‌లు, ప్రీప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రీప్రైమరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను ఒకే క్యాంపస్‌లో అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పాఠశాలల విలీనం ద్వారా ఒక్కో టీపీఎస్‌లో విద్యార్థుల సంఖ్య కనీసం 1000 నుంచి 1500 వరకు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదవడం ద్వారా మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం, వనరులను సమర్థంగా వినియోగించడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందుతున్న నేపథ్యంలో.. టీపీఎస్‌లలో సాయంత్రం కూడా అల్పాహారం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచడమే టీపీఎస్‌ల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.



