హసన్పర్తి,(తెలంగాణ గళం) అక్టోబర్ 4:
కరీంనగర్-వరంగల్ (KNR-WGL) జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ జిల్లా కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది (మరికొందరు) కూలీలు పనుల నిమిత్తం వ్యాన్లో కరీంనగర్ వైపు వెళ్తున్నారు.
ఈ క్రమంలో హుజురాబాద్ పట్టణ పరిధిలోని పెద్దపాపయ్యపల్లి శివారుకు చేరుకోగానే వ్యాన్ వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజురాబాద్ (HZB) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






