తెలంగాణ

హాసన్ పర్తి ఎల్లమ్మ ఆలయంలో వినాయక నిమర్జనోత్సవం

హాసన్ పర్తి, సెప్టెంబర్ 25 (తెలంగాణ గళం): వర్ధన్నపేట నియోజకవర్గం, గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ పరిధిలోని హాసన్ పర్తి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి…

By · · Updated

Share this article
హాసన్ పర్తి ఎల్లమ్మ ఆలయంలో వినాయక నిమర్జనోత్సవం

హాసన్ పర్తి, సెప్టెంబర్ 25 (తెలంగాణ గళం):

వర్ధన్నపేట నియోజకవర్గం, గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ పరిధిలోని హాసన్ పర్తి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నాటితో ఘనంగా ముగిశాయి. చివరి రోజు వినాయక నిమర్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బొజ్జ గణపయ్యకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

ఈ వేడుకలకు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ... శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో హాసన్ పర్తి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గణపతి నిమర్జన శోభాయాత్రను భక్తులు, ముఖ్యంగా యువత భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు