హసన్పర్తి, తెలంగాణ గళం,( అక్టోబర్ 1):
• ముఖ్య అతిథిగా హాజరైన ఐసిడిఎస్ సిడిపిఓ స్వరూప
• రక్తహీనత లేని సమాజమే లక్ష్యం కావాలి
జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకొని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ భీమదేవరపల్లి పరిధిలోని భీమారం సెక్టార్ చింతగట్టు 1, 2, 3 మరియు మునిపెల్లి, పోచమ్మ గుడి సెంటర్, గ్రామాలలో పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ భీమదేవరపల్లి సిడిపిఓ స్వరూప ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిడిపిఓ స్వరూప మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పోషకాహారం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలు తమ రోజువారీ దినచర్యలో భాగంగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలు రక్తహీనత (ఎనిమియా) బారిన పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే ప్రతి ఇల్లు, కుటుంబం ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు.
పోషణ మాసంలో శ్రీమంతాల వేడుక:
ఈ కార్యక్రమంలో భాగంగా ఏరుకొండ స్వప్న-శ్రీనివాస్ ల ప్రోత్సాహంతో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గర్భిణీలు పోషక విలువలతో కూడిన సంపూర్ణ ఆహారాన్ని తీసుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వగలరని, తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో భీమారం సెక్టార్ సూపర్వైజర్ కల్పన, అంగన్వాడీ టీచర్స్ జనగాని స్వప్న, పద్మ, శైలజ, సరోజన, మోడెం స్వప్న, (ఎస్ హెచ్ జి ) సభ్యులు సుజాత, మంజుల, (ఏ ఎల్ ఎం ఏస్ సి ) కమిటీ సభ్యులు, ఏఎన్ఎం విజయ, ఆశా వర్కర్లు మాధవి, నాగమణి, స్రవంతి మరియు స్థానిక మహిళలు, తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






