అంగన్వాడీల్లో పోషకాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
పరకాల, తెలంగాణ గళం:అక్టోబర్ 8:
అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారం, బాలల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.

పరకాలలోని ఆర్.ఆర్ గార్డెన్స్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీల ద్వారా పోషకాహారం, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. కేవలం అన్నం కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పప్పులతో కూడిన సమతుల్య ఆహారం అవసరమన్నారు. జిల్లాలో SAM, MAM కేసులు గణనీయంగా తగ్గాయని, ఒక్క కేసు కూడా లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు.
తొలి వెయ్యి రోజులు తల్లీబిడ్డలకు అత్యంత కీలకమని, బాలామృతాన్ని లడ్డూలు, కేకుల రూపంలో పిల్లలకు ఇష్టంగా మార్చి అందించాలని సూచించారు. ప్రతి గ్రామంలో నెలకు ఒకసారి విలేజ్ హెల్త్, శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఆర్డీవో డీఎస్ వెంకన్న పాల్గొని మాట్లాడారు. అనంతరం ఉత్తమ పనితీరు కనబరిచిన సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పోషణపై ప్రతిజ్ఞ చేయించి, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దకోడేపాకకు చెందిన 7 నెలల చిన్నారి మహాకు కలెక్టర్ అన్నప్రాసన చేశారు.





